Monday, October 8, 2018

చర్చి మరియు ఆలయం అనే పదాల కొత్త నిబంధన అర్థం ఏమిటి?



చర్చి పక్కనే ఉన్నానండి, చర్చికి రంగులు వేస్తున్నాము, మందిరములో కుర్చీలు సర్దుతున్నాను, ఆలయం పక్కనే నిలబడ్డాను... అని చెప్పే మాటల్లో, సంఘము సమావేశమవడానికి ఏర్పరచుకున్న భవనమును, చర్చి, ఆలయం మరియు మందిరం అని పిలుస్తున్నట్లు అర్థమవుతుంది. 

ఇలా పిలవడం వాక్యానుసారమా? మానవ కల్పితమా?

చర్చ్ అనే ఆంగ్ల పదమును తెలుగులో సంఘము అంటారు. బైబిల్ లో సంఘం (చర్చ్) అనే పధమును వాడిన సందర్భాలను గమనిచుదాం!


సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను. అపొస్తలుల కార్యములు 8.3 
 సౌలు పాడుచేసింది ప్రజలను, అంతే కానీ భవమును కాదు.  



పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. అపొస్తలుల కార్యములు 12.5
ప్రార్థన చేసింది ప్రజలు, అంతే కానీ భవము కాదు. 


కొరింథులోనున్న దేవుని సంఘమునకుఅనగా                   క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా         ఉండుటకు పిలువబడినవారికి .... శుభమని చెప్పి     వ్రాయునది. 1 కోరింథి 1.2
పౌలు లేఖ వ్రాసింది ప్రజలకు, అంతే కానీ, భవనముకు కాదు. బైబిల్ లో ఎక్కడా కూడా "సంఘ భవనమును", సంఘం (చర్చ్) అని పిలువలేదు. 

సంఘము అనే పదము గ్రీకు భాషలోని ఎక్లేషియా అనే పదము నుండి తీసుకొనబడినది. దాని అర్థం "బయటకు పిలువబడినవారు". కావున ఈ పదము ప్రకారము కూడా అది భవనం కాదు అని అర్థం చేసుకోవచ్చు.


మరి ఆలయం లేదా మందిరం అని పిలువవచ్చా? 

ఆ రెండు పదాల అర్ధం "దేవుడు నివసించు స్థలం". యేసు ప్రభువు సిలువ మరణముకు ముందు, దేవుడు మనుష్యులలో నివసించలేదు. స్థలమును (కొండ, ప్రత్యక్ష గుడారమును) మరియు భవనమును (ఆలయం) ను ప్రత్యేకపరచుకొని అక్కడకి దిగి వచ్చాడు.

కానీ తరువాత,  
   మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ         మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? .... దేవుని       ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై           యున్నారు.  1 కోరింథి 3.16-17
సిలువ మరణము తరువాత క్రీస్తు రక్తములో కడుగబడిన ప్రజలలో దేవుడు నివాసముంటున్నాడు. అతి పరిశుద్ధ స్థలపు తెర చినిగింది. దేవుడు నివసించే స్థలం భవనంలో నుండి మనుష్యులలోనికి వచ్చింది. 

"ఆలయం" అనే పముకు గ్రీకు లో రెండు పదములు వివిధ సందర్భాలలో వేరుగా వాడినారు. అవి "హిరోన్" (heiron) మరియు "నావోస్" (naos). 

ఆ రెండు పదాలను బైబిల్ లో వాడిన విధానమును పరిశీలిస్తే ఒక ఆశక్తికర విషయం తెలుసుకోవచ్చు. బైబిల్ లో పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడినప్పుడు "నావోస్" అనే పదమును, ఆవరణము గురించి మాట్లాడినప్పుడు "హిరోన్" అనే పదమును ఉపయోగించారు.


యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయము (నావోస్) లోనికి వెళ్లి ధూపమువేయు టకు అతనికి వంతు వచ్చెను. లూకా 1.9 
 యాజకుడు దూపము వేసే స్థలము పరిశుద్ధ స్థలం కావున "నావోస్"అనే పదమును ఉపయోగించారు.


ఆయన దేవాలయము (హిరోన్) లోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయు చున్నావు? మత్తయి 21.23
యేసు ప్రభువు బోధించినది ఆవరణములో కావున "హిరోన్" అనే పదమును ఉపయోగించారు.


అప్పుడు దేవాలయపు (నావోస్) తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను.        మత్తయి 27.51 
 అది పరిశుద్ద స్థలంలో జరిగింది కావున "నావోస్" అనే పదమును ఉపయోగించారు.



మీరు దేవుని ఆలయమై (నావోస్) యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ... దేవుని ఆలయము (నావోస్)     పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై (నావోస్) యున్నారు.    1 కోరింథి 3.16-17
ఆవరణమునకు ఉపయోగించిన "హీరోన్" అనే పదము కాక, పరిశుద్ధ స్థలం మరియు అతి పరిశుద్ధ స్థలానికి కలిపి వాడిన పదము అయిన "నావోస్" అనే పదమును మనకు వాడడం ద్వారా మనల్ని దేవుడు నివసించే పరిశుద్ధ స్థలముగా చేసియున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. 

కొత్త నిబంధన ప్రకారం, మనమే సంఘం... మనమే ఆలయం.
కావున సంఘము సమావేశమవడానికి ఏర్పరచుకున్న భవనమును, పిలువడానికి "చర్చి, ఆలయం మరియు మందిరం" అనే పదాలు ఉపయోగించరాదు, "సంఘ భవనం, చర్చ్ బిల్డింగ్, చర్చ్ హాల్.." అనేవి ఉపయోగించవచ్చు.


వ్యత్యాసం తెలియకపోతే?

క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన ప్రజల మీద ఉంచాల్సిన దృష్టి, కేవలం బిల్డింగ్ పైన ఉంచి, దేవునికి నమ్మకమైన పరిచర్య చేస్తున్నామనుకుంటున్నారు. 


మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి 16.18  
పై వచనమును చదివి, సంఘమంటే భవనం అనుకొని, ఒక సంఘ భవనమును ఒక గ్రామంలో నిర్మించడం ద్వారా ఆ పని చేసినామనుకుంటున్నారు. సువార్త ప్రకటించడం లో ఏ మాత్రం ఖర్చు చేయకుండా కేవలం సంఘ భవన నిర్మాణం, ఆ తరువాత ప్రహరీ గోడ, ఆ తరువాత భవన సుందరీకరణ అంటూ సంఘ ధనమంత ఖర్చు చేస్తున్నారు. 

సుందరంగా నిర్మింపబడిన సంఘ భవనమును చూసి ఎవరైనా "అబ్బా! ఈ చర్చ్ ఎంత బాగుంది" అంటుంటే, చర్చ్ (సంఘం) బాగుందని ప్రజల ఆత్మీయ స్థితి చూసి చెప్పాలి కానీ, భవనమును చూసి కాదు అని బైబిల్ ఘోషిస్తోంది.

కావున, సంఘ భవనమును చూసో, సంఖ్యను చూసో కాక, వాక్యాన్ని చూసి, ఆత్మీయతను చూసి సంఘములో చేరాలి.

సంఘ భవన నిర్మాణానికి బైబిల్ వ్యతిరేకం కాదు. కానీ, ఆ నిర్మాణాలు విగ్రహాలలా మరిపోకూడదు, వాటిని చూసి మురిసిపోకూడదు. రక్షింపబడని వారికి సువార్త మరియు రక్షింపబడిన వారికి ఆత్మీయ ఎదుగుదల, కొరకు పెట్టె ఖర్చు, భవనాల కొరకు పెట్టె ఖర్చు కంటే ఎక్కువ ఉండాలి.

"7000 మంది పట్టే సంఘానికి కాపరి" అని ఒక మీటింగ్ పోస్టర్ లో కనబడింది. అతను 7000 మందికి కాపరా? లేదా 7000 మంది పట్టే సంఘ భవనానికి కాపరా? ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలకు కాక భవనాలకు కారులుగా ఉంటున్నారు. 

అందుకే.. 
సంఘ భవనాలు సుందరంగా మరియు మెరిసిపోతూ కనబడుతున్నాయి కానీ, ఆలయాలు శిథిలమైపోతున్నాయి, సంఘాలు కళంకంలో ఉన్నాయి.(ఆలయాలు మరియు సంఘాలు అంటే క్రీస్తు ప్రజలు)
ఈ కింది వచనములో, దేవుడు కాపరిగా ఉండమని చెప్పింది, సంఘ భవనమునకా? సంఘముగా?
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.                                    అపొస్తలుల కార్యములు 20.28
  సంఘముకు మరియు సంఘ భవనానికి ఉన్న వ్యత్యాసం క్రైస్తవులకందరికి అర్థమయినప్పుడు, సంఘము యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది.