Monday, October 8, 2018

చర్చి మరియు ఆలయం అనే పదాల కొత్త నిబంధన అర్థం ఏమిటి?



చర్చి పక్కనే ఉన్నానండి, చర్చికి రంగులు వేస్తున్నాము, మందిరములో కుర్చీలు సర్దుతున్నాను, ఆలయం పక్కనే నిలబడ్డాను... అని చెప్పే మాటల్లో, సంఘము సమావేశమవడానికి ఏర్పరచుకున్న భవనమును, చర్చి, ఆలయం మరియు మందిరం అని పిలుస్తున్నట్లు అర్థమవుతుంది. 

ఇలా పిలవడం వాక్యానుసారమా? మానవ కల్పితమా?

చర్చ్ అనే ఆంగ్ల పదమును తెలుగులో సంఘము అంటారు. బైబిల్ లో సంఘం (చర్చ్) అనే పధమును వాడిన సందర్భాలను గమనిచుదాం!


సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను. అపొస్తలుల కార్యములు 8.3 
 సౌలు పాడుచేసింది ప్రజలను, అంతే కానీ భవమును కాదు.  



పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. అపొస్తలుల కార్యములు 12.5
ప్రార్థన చేసింది ప్రజలు, అంతే కానీ భవము కాదు. 


కొరింథులోనున్న దేవుని సంఘమునకుఅనగా                   క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా         ఉండుటకు పిలువబడినవారికి .... శుభమని చెప్పి     వ్రాయునది. 1 కోరింథి 1.2
పౌలు లేఖ వ్రాసింది ప్రజలకు, అంతే కానీ, భవనముకు కాదు. బైబిల్ లో ఎక్కడా కూడా "సంఘ భవనమును", సంఘం (చర్చ్) అని పిలువలేదు. 

సంఘము అనే పదము గ్రీకు భాషలోని ఎక్లేషియా అనే పదము నుండి తీసుకొనబడినది. దాని అర్థం "బయటకు పిలువబడినవారు". కావున ఈ పదము ప్రకారము కూడా అది భవనం కాదు అని అర్థం చేసుకోవచ్చు.


మరి ఆలయం లేదా మందిరం అని పిలువవచ్చా? 

ఆ రెండు పదాల అర్ధం "దేవుడు నివసించు స్థలం". యేసు ప్రభువు సిలువ మరణముకు ముందు, దేవుడు మనుష్యులలో నివసించలేదు. స్థలమును (కొండ, ప్రత్యక్ష గుడారమును) మరియు భవనమును (ఆలయం) ను ప్రత్యేకపరచుకొని అక్కడకి దిగి వచ్చాడు.

కానీ తరువాత,  
   మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ         మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? .... దేవుని       ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై           యున్నారు.  1 కోరింథి 3.16-17
సిలువ మరణము తరువాత క్రీస్తు రక్తములో కడుగబడిన ప్రజలలో దేవుడు నివాసముంటున్నాడు. అతి పరిశుద్ధ స్థలపు తెర చినిగింది. దేవుడు నివసించే స్థలం భవనంలో నుండి మనుష్యులలోనికి వచ్చింది. 

"ఆలయం" అనే పముకు గ్రీకు లో రెండు పదములు వివిధ సందర్భాలలో వేరుగా వాడినారు. అవి "హిరోన్" (heiron) మరియు "నావోస్" (naos). 

ఆ రెండు పదాలను బైబిల్ లో వాడిన విధానమును పరిశీలిస్తే ఒక ఆశక్తికర విషయం తెలుసుకోవచ్చు. బైబిల్ లో పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడినప్పుడు "నావోస్" అనే పదమును, ఆవరణము గురించి మాట్లాడినప్పుడు "హిరోన్" అనే పదమును ఉపయోగించారు.


యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయము (నావోస్) లోనికి వెళ్లి ధూపమువేయు టకు అతనికి వంతు వచ్చెను. లూకా 1.9 
 యాజకుడు దూపము వేసే స్థలము పరిశుద్ధ స్థలం కావున "నావోస్"అనే పదమును ఉపయోగించారు.


ఆయన దేవాలయము (హిరోన్) లోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయు చున్నావు? మత్తయి 21.23
యేసు ప్రభువు బోధించినది ఆవరణములో కావున "హిరోన్" అనే పదమును ఉపయోగించారు.


అప్పుడు దేవాలయపు (నావోస్) తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను.        మత్తయి 27.51 
 అది పరిశుద్ద స్థలంలో జరిగింది కావున "నావోస్" అనే పదమును ఉపయోగించారు.



మీరు దేవుని ఆలయమై (నావోస్) యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ... దేవుని ఆలయము (నావోస్)     పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై (నావోస్) యున్నారు.    1 కోరింథి 3.16-17
ఆవరణమునకు ఉపయోగించిన "హీరోన్" అనే పదము కాక, పరిశుద్ధ స్థలం మరియు అతి పరిశుద్ధ స్థలానికి కలిపి వాడిన పదము అయిన "నావోస్" అనే పదమును మనకు వాడడం ద్వారా మనల్ని దేవుడు నివసించే పరిశుద్ధ స్థలముగా చేసియున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. 

కొత్త నిబంధన ప్రకారం, మనమే సంఘం... మనమే ఆలయం.
కావున సంఘము సమావేశమవడానికి ఏర్పరచుకున్న భవనమును, పిలువడానికి "చర్చి, ఆలయం మరియు మందిరం" అనే పదాలు ఉపయోగించరాదు, "సంఘ భవనం, చర్చ్ బిల్డింగ్, చర్చ్ హాల్.." అనేవి ఉపయోగించవచ్చు.


వ్యత్యాసం తెలియకపోతే?

క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన ప్రజల మీద ఉంచాల్సిన దృష్టి, కేవలం బిల్డింగ్ పైన ఉంచి, దేవునికి నమ్మకమైన పరిచర్య చేస్తున్నామనుకుంటున్నారు. 


మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి 16.18  
పై వచనమును చదివి, సంఘమంటే భవనం అనుకొని, ఒక సంఘ భవనమును ఒక గ్రామంలో నిర్మించడం ద్వారా ఆ పని చేసినామనుకుంటున్నారు. సువార్త ప్రకటించడం లో ఏ మాత్రం ఖర్చు చేయకుండా కేవలం సంఘ భవన నిర్మాణం, ఆ తరువాత ప్రహరీ గోడ, ఆ తరువాత భవన సుందరీకరణ అంటూ సంఘ ధనమంత ఖర్చు చేస్తున్నారు. 

సుందరంగా నిర్మింపబడిన సంఘ భవనమును చూసి ఎవరైనా "అబ్బా! ఈ చర్చ్ ఎంత బాగుంది" అంటుంటే, చర్చ్ (సంఘం) బాగుందని ప్రజల ఆత్మీయ స్థితి చూసి చెప్పాలి కానీ, భవనమును చూసి కాదు అని బైబిల్ ఘోషిస్తోంది.

కావున, సంఘ భవనమును చూసో, సంఖ్యను చూసో కాక, వాక్యాన్ని చూసి, ఆత్మీయతను చూసి సంఘములో చేరాలి.

సంఘ భవన నిర్మాణానికి బైబిల్ వ్యతిరేకం కాదు. కానీ, ఆ నిర్మాణాలు విగ్రహాలలా మరిపోకూడదు, వాటిని చూసి మురిసిపోకూడదు. రక్షింపబడని వారికి సువార్త మరియు రక్షింపబడిన వారికి ఆత్మీయ ఎదుగుదల, కొరకు పెట్టె ఖర్చు, భవనాల కొరకు పెట్టె ఖర్చు కంటే ఎక్కువ ఉండాలి.

"7000 మంది పట్టే సంఘానికి కాపరి" అని ఒక మీటింగ్ పోస్టర్ లో కనబడింది. అతను 7000 మందికి కాపరా? లేదా 7000 మంది పట్టే సంఘ భవనానికి కాపరా? ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలకు కాక భవనాలకు కారులుగా ఉంటున్నారు. 

అందుకే.. 
సంఘ భవనాలు సుందరంగా మరియు మెరిసిపోతూ కనబడుతున్నాయి కానీ, ఆలయాలు శిథిలమైపోతున్నాయి, సంఘాలు కళంకంలో ఉన్నాయి.(ఆలయాలు మరియు సంఘాలు అంటే క్రీస్తు ప్రజలు)
ఈ కింది వచనములో, దేవుడు కాపరిగా ఉండమని చెప్పింది, సంఘ భవనమునకా? సంఘముగా?
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.                                    అపొస్తలుల కార్యములు 20.28
  సంఘముకు మరియు సంఘ భవనానికి ఉన్న వ్యత్యాసం క్రైస్తవులకందరికి అర్థమయినప్పుడు, సంఘము యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది.  



Saturday, September 22, 2018

యేసు ప్రభువు ఎలా తక్కువ కాలంలో తన పని ముగించాడు


చార్లెస్ ఇ. హమెల్ వ్రాసిన అర్జెంట్ పనుల నిరంకుశత్వం అనే ఆర్టికల్ ను నావిగేటర్స్ వారు ప్రచురించిన 2.7 సిరీస్ అనబడే శిష్యత్వపు కోర్స్ లో చదవి, చాలా సార్లు ఈ ఆర్టికల్ పై చర్చించి, నా సమయ పాలనలో అనేక మార్పులు చేసుకున్నాను. ఆ ఆర్టికల్ ని సంక్షిప్తంగా వ్రాసి మీ ముందుంచుతున్నాను.


మన జీవితములో చేయలేక వదిలేసిన పనులు ఎన్నో ఉన్నాయి.
"1. దేవునితో చాలినంత సమయం గడపకపోవడం,  
2. భార్యా పిల్లలకు ఇవ్వాల్సినంత పట్టింపు ఇవ్వకపోవడం,  
3. సంఘ క్షేమాభివృద్ధికి దేవుడు మనకిచ్చిన తలంతును దాని పరిమాణం మేరకు వినియోగించకపోవడం,  
4. మనమెక్కువ సమయం గడిపిన వారికి సైతం రక్షణ సువార్తను పూర్తిగా వివరించకపోవడం,  
5. మన కుటుంబ పోషణ కొరకు చేసే పనిలో శక్తిమేర చేయకపోవడం..మొదలగునవి."

మనము చేయవలసినవి ఎందుకు చేయలేదంటే, వాటిని చేయవలసిన సమయంలో ఏవో ప్రాముఖ్యము కాని, అప్పుడే చేయవలసిన (అర్జెంట్) పనులు అనే డిమాండ్లు మన స్థావరం లోనికి చొచ్చుకు వచ్చి, మనము రక్షించబడిన తరువాత జీవితములో వేటిని చేయాలని దేవుడు ముందుగా సిద్ధపరిచాడో (ఎఫెసీ 2.10) ఆ సత్క్రియలు చేయకుండా మనల్ని మన బాధ్యతలలో ఒడిపోయినవారుగా చేస్తున్నాయి.

యేసు ప్రభువు భూమిమీద మరణ దినమునకు ముందు రోజు రాత్రి,
"చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని (యోహాను 17.4)"
అని ఎలా చెప్పాడు? పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు తానేనని ప్రజలకు ఋజువుచేసే అద్భుత కార్యాలు జరిగించాలి, రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేయాలి, దానిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసే వ్యక్తులను తయారు చేయాలి. ఇదంతా కేవలం మూడున్నర సంవత్సరాలలో!


తన ముందు నిర్ధేశించబడిన లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో తండ్రి సూచనలకై కనిపెట్టే లక్షణాన్ని కలిగి,
"ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను (మార్కు 1.35)."
ఆ కారణంగానే మనుష్యులు అర్జంటుగా అడుగుతున్నవాటిని అడ్డగిస్తూ, తన కార్యచరణకై ఏది అవసరమో దాన్నే చేయగలిగాడు. అనుసరిస్తున్న జనసమూహము యొక్క పాపులారిటీని కోరక, శిష్యులను తయారు చేయుటపై దృష్టి సారించాడు.


అర్జెంట్ పనుల నిరంకుశత్వానికి బానిసలై, అందరిని తృప్తి పరచాలి, అన్నిట్లో పాల్గొనాలి, అన్ని నా ద్వారా జరగాలి, అనే ఆలోచనలతో, అన్నీ చేపట్టి, వాటిని నెరవేర్చడం కోసం ఉన్మాదిలా పరుగెడుతూ,  నిరాశకు, తీవ్ర ఒత్తిడికి లోనవడం,  అల్సర్లు, గుండెపోటు..లాంటివి పొందుకోవడం, అన్నిటికంటే మిన్నగా మన అసలు బాధ్యతలను నాణ్యముగా చేయకపోవడం జరుగుతుంది.


అనుదినం దేవుని సూచనాలకై కనిపెట్టడానికి, మన బాధ్యతలను నెరవేర్చే ప్రణాలికను అంచనా వేసుకోవడానికి, దానిని చేయడానికి అవసరమైన దేవుని శక్తిని కోరడానికి, సరిపడినంత సమయాన్ని కేటాయించుదాం...ఆయన అప్పగించిన పనిని సంపూర్ణముగా పూర్తిచేద్దాము... భళా! నమ్మకమైన మంచి దాసుడా" (మత్తయి 25.21) అని ప్రభువు నోట వినటానికి ఆశిద్దాం.

Thursday, September 20, 2018

ఒక ప్రముఖ పాట వెనుక నిజ సంఘటన



చాలా పాటలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే ఇంగ్లీష్ పాట క్రైస్తవ సంఘాలలో చాలా ప్రాచుర్యములో ఉన్నది. అదే పాట 'నే వెంబడింతును నా యేసుని నిత్యము' అని తెలుగులో తర్జుమా చేయబడింది.


మన దేశంలో అస్సాం అనే ప్రాంతంలో ఒక వెల్స్ మిషనరీ 19 వ శతాబ్దం మధ్యకాలంలో గ్యారో అనే (మానవుల తలలు వేటాడే) తెగ వారి మధ్య సువార్త ప్రకటించాడు. వారిలో ఒకడైన నోక్సెంగ్ అనే వ్యక్తి తన భార్య మరియు యిద్దరు పిల్లలతో సహా, యేసు ప్రభువునందు విశ్వాసముంచాడు.


ఆ గ్రామ పెద్ద, నోక్సెంగ్ యొక్క కుటుంబమును, ఆ గ్రామ ప్రజలందరి యెదుట నిలిపి, యేసుని విడిచిపెట్టకపోతే, అతని ఇద్దరు పిల్లలను చంపుతానని బెదిరించాడు. అప్పుడు నోక్సెంగ్ 'ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్' (యేసుని వెంబడించుటకు నిర్ణయించుకున్నాను, నేను వెనుదిరుగను) అని అన్నాడు.


ఆ పిల్లలను చంపి, మళ్ళి, యేసుని విడిచిపెట్టకపోతే అతని భార్యను చంపుతానని బెదిరించాడు గ్రామ పెద్ద. అప్పుడు నోక్సెంగ్ 'ధో నన్ గో విత్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో' (నాతో ఎవరు రాకున్నా, నేను మాత్రము వెంబడిస్తాను) అని అన్నాడు.


ఆతని భార్యని చంపి, మళ్ళి, యేసుని విడిచిపెట్టకపోతే అతన్ని కూడా చంపుతానని బెదిరించాడు గ్రామ పెద్ద. అప్పుడు నోక్సెంగ్ 'ధ క్రాస్ బిఫోర్ మీ, ధ వరల్డ్ బిహైండ్ మీ' (సిలువ నా ముందుంది, లోకం నా వెనుకుంది) అని అన్నాడు. వెంటనే అతనిని కూడా వారు చంపివేశారు.


నోక్సెంగ్ యొక్క దృఢమైన విశ్వాసమును చూసి, ఆ గ్రామ పెద్ద మరియు గ్రామస్థులందరు యేసు ప్రభువునందు విశ్వాసముంచారు.


ఆయన పలికిన చివరి మాటలను మనము పాటగా పాడుకుంటున్నాము. బిల్లీ గ్రహం గారు ఎక్కువగా సువార్త సభలలో ఈ పాటను ఉపయోగించేవారు.


హతసాక్షుల రక్తము సంఘమునకు విత్తనముగా ఉన్నది.

అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును (మత్తయి 16.24-25)

ఒకవేళ ప్రభువును తృణీకరిస్తె, అప్పుడు వారి చేతిలో చావకపోయిన ఏదో ఒకరోజు చనిపోయి నరకంలో ఉండేవాడు. నిజముగా రక్షింపబడినవాడు అంతము వరకు ప్రభువును వెంబడిస్తాడు, అంతేగాని ఎవరో చంపుతానంటే బెదిరిపోయి క్రీస్తును వదిలిపెట్టడు.  


ఇతరులు వచ్చి హింసిస్తున్నపుడు మనలో వారు స్వచ్ఛమైన విశ్వాసమును చూడాలి, కాని పోకిరి మాటలు, మీసాలు మెలేస్తూ.. తొడలు కొడుతూ.. సవాళ్లు చేయడం.. కాదు.


"నా మరణం కొంతమంది కళ్ళు తెరిపిస్తుందంటే, నేను హతసాక్షి అవడానికైనా సిద్ధం" అనే నిర్ణయం కలిగిన విశ్వాసులు నేడు కావలి.


మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను (రోమా 8.18).


Tuesday, September 18, 2018

శిష్యరికం - సంఘ కాపరి ప్రధాన బాధ్యత



'శిష్యులను తయారు చేయుడి' అనేది ప్రభువైన యేసు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ (మత్తయి 28.19). పశ్చాత్తాపముతో పాపము విషయమై మారుమనస్సు పొంది, పూర్ణహృదయముతో యేసు ప్రభువునందు (ఆయనే నిజ దైవం, నా పాప పరిహారము నిమిత్తము సిలువలో బలియైనాడు, తన ద్వారానే నిత్యజీవము అని) విశ్వసించి, ఆయన ఇచ్చు రక్షణను పొందుకొనిన ప్రతి వ్యక్తి, స్థానిక సంఘములో నిరంతర శిష్యరికం అనే ప్రక్రియ కిందకు వచ్చి, వాక్యము చదవడం, వాక్యానుసార పుస్తకాలు చదవడం, సరియైన బోధ వినడం ద్వారా నేర్చుకొన్నవి పాటిస్తూ, క్రీస్తు సారూప్యత లోనికి మారాలి.


అయితే చాలా మంది మతమును ఆచరిస్తున్నట్టుగా, క్యాలెండర్ లోని ఒక వచనమును చదివి, కేవలం ఇహ లోక కోరికలు కోరుకోవడమే ప్రార్థన అన్నట్టుగా ప్రార్థించి, డబ్బులిస్తే (స్పాన్సర్ చేస్తే) దేవుడు బాగుచేస్తాడు, ఉద్యోగమిస్తాడు, పెళ్లిచేస్తాడు, పిల్లలిస్తాడు, పదోన్నతినిస్తాడు అని గుడ్డిగా నమ్మి ఆచరిస్తూ, క్రైస్తవ జీవితములో ఒక్క శ్రమ, అనారోగ్యము ఉండదు అని చెప్పే వాక్య విరుద్ధ బోధను నమ్మి, శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ, ఈ భూమిపై పేరును, ధనమును, కుటుంబమును గొప్ప చేసుకోవడమే లక్ష్యముగా బ్రతుకుతున్నారు.


కొంతమంది పాస్టర్లు దేవుని సంకల్పమంత (అపొ 20.27) బోధించక, బైబిల్ కు స్వంత అర్థమును ఆపాధిస్తూ, మా కుటుంబము మాత్రమే దేవునిలో ఎక్కువ ఎదగాలని ఇతరులకు ఏమి నేర్పించక, క్రీస్తు శిష్యులనుగా  చేయాల్సిన సమయములో తమ స్వంత అనుచరులను పొగుచేసుకుంటున్నారు. అందువల్ల చాలా మంది విశ్వాసులు లోకములోకి, అబద్దబోధలోనికి మరలుతున్నారు.


కావున పౌలు గారు చెప్పినట్లుగా,
నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది (గలతి 4.19).

ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము (కొలొస్సి 1.28).


ప్రతి సంఘ సభ్యున్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, బోధించుచు, క్రీస్తును ప్రకటించుటలో ప్రయాసపడుదాము.  


గమనిక: కొంత మంది సంఘ కాపరులు శ్రద్ధతో సంఘ సభ్యులను శిష్యులుగా చేయాలనీ ప్రయత్నించినా, ఆదివారం హాజరవడం తప్ప మాకు సమయం లేదు అని చెప్తు తప్పించుకు తిరిగే వారు లేకపోలేదు. వారి ఆశ్రద్దకు తగ్గమూల్యం చెల్లించక తప్పదు.

Monday, September 17, 2018

సంఘం కొరకు పౌల్ గారి ప్రార్థనలో ఒక కీలక విషయం


కుల ఆధారిత హెచ్చుతగ్గులు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు, లోకపు దృక్పథాన్ని గ్రుడ్డిగా అనుసరించక వాక్య ఆధారిత ఆలోచన కలిగి, లోకమునకు ఉప్పులా మరియు వెలుగులా బ్రతకాలని బైబిల్ హెచ్చరిస్తుంది. 

ఎఫెసియులకు వ్రాసిన పత్రికలో రెండవ ప్రార్థన (3.15-19) యొక్క సందర్భమును గమనిస్తే, ఆ ప్రార్థన లోని మనవులు, హెచ్చుతగ్గుల నిర్ములనకై మనలో ఎలాంటి మార్పులు రావాలో తెలియజేస్తుంది.

రెండవ అధ్యయము నుండి, మన పూర్వ స్థితి ఎంత పాప సహితమయిందో, అక్కడనుండి లేపి దేవుడు మనల్ని ఉచితముగా రక్షించి, క్రీస్తుయేసునందు మనలను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి, ఈ భూమిపై  విశ్వాససమాజము అంతా ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయుండి దేవునికి నివాసస్థలముగా కట్టబడుతున్నామని మరియు సమానవారసులము, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునైయున్నామని తెలిపి, అలా తమ సమానత్వాన్ని విశ్వాసులంతా పాటించాలని పౌలు గారు ప్రార్తన చేయడం జరిగింది.

తన ప్రార్థనలోవున్న మనవులు: 
1. మనము అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను ,
2. క్రీస్తు మన హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,
3. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, 
4. ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

మనము ఎక్కువగా శారీరక ఆరోగ్యము మరియు క్షేమము కొరకు మాత్రమే ప్రార్ధిస్తాము కానీ ఆత్మీయ జీవితము బలముగా ఉండాలని తపన కావాలి. ఏ కులము వారైనా ఆదాము అవ్వ నుండే వచ్చినామని నమ్మితే హెచ్చుతగ్గులేక్కడివి? అందరమూ సృష్టి ద్వారా సమానమే కదా? ఆత్మీయంగా బలహీనులే కుల వ్యత్యాసాలను వివాహములో చూపిస్తారు. అందుకే పౌల్ గారు, హెచ్చుతగ్గులు వద్దు అని వివరించి అలా ప్రార్థించాడు. అప్పుడు మనము క్రీస్తును నిజముగా మన హృదములో కలిగిన వారముగా కనబడుతాము మరియు  దేవుని సంపూర్ణతయందు పూర్ణులమవుతాము. మనము క్రీస్తు ప్రేమను పరిశీలించి తెలుసుకోని, ఆయనలా ప్రేమించడంలో ఎదగాలని ఈ వాక్యమునుండి అన్వయించుకుందాము. 

ప్రార్థన:

ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి!

మాలోని ఈ లోకానుసార వ్యత్యాసాలు తొలగించి, క్రైస్తవ సమాజమంతటికి సమానత్వ దృక్పథాన్ని ఇమ్మని, మేము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల నిన్ను, యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి.

క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై స్పందించే తీరు




అయ్యో ! నా క్రైస్తవ్యంపై దాడి జరుగుతుంది
ఒక  క్రైస్తవుడిగా నేనేమైనా చేయాలి  అన్న
నీ హృదయ అభిలాషకు నా ప్రశ్నలు ...


మొదట
ఒక  క్రైస్తవుడిగా చేయాల్సిన పనులు చేస్తున్నావా?


ఒక  క్రైస్తవుడిగా మారుమనుస్సుకు తగిన ఫలములు  ఫలిస్తున్నవా?
ఒక  క్రైస్తవుడిగా ప్రార్ధనలో దేవుడితో కన్నీటితో మొఱ్ఱపెడుతున్నావా?
ఒక  క్రైస్తవుడిగా దేవుని వాక్యాన్ని ధ్యానించి పాటిస్తున్నావా?
ఒక  క్రైస్తవుడిగా సంఘములో బాధ్యతాయుతముగా వుంటున్నావా?
ఒక  క్రైస్తవుడిగా నీ కుటుంబమును దేవునిలో ఎదిగిస్తున్నావా?
ఒక  క్రైస్తవుడిగా నీవు క్రీస్తు స్వరూప్యములోకి మారుతున్నవా?
ఒక  క్రైస్తవుడిగా నీ సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్నవా?


మొదట ఒక  క్రైస్తవుడిగా చేయాల్సిన పనులు చేసి
అటు తరువాత బైబిల్ సూచనల మేరకే స్పందిచాలి


క్రీస్తు కొరకు జీవించడమంటే ....
క్రీస్తుకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నవారిని దూషించడం కాదు,
క్రీస్తు తో సాన్నిహిత్య సంబంధం కలిగి జీవించటం


క్రీస్తు జీవితంలో లేకుండా  క్రీస్తు కోసం చేసేవన్నీ వ్యర్థమే
మీరెవరో నాకు తెలియదు అని క్రీస్తు చెప్పుతాడు అని తెలియదా?


సరే ! క్రీస్తుతో నా అనుదిన సంబంధం బాగుంది ,
నేనెలా స్పందించాలి అని తెలుసుకోవాలనుకుంటున్నావా?


నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక,
నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
మత్తయి 5 .39


నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి
కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి.
మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5 .44


పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు
అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. అపో కార్యములు  12 .5


అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన
మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి,
యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము;
వారె వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవలెనని చెప్పెను.
అపో కార్యములు 16 .37
(పౌలు గారు ప్రశ్నించాడు .. కానీ బూతులు, పోకిరి మాటలు వాడలేదు)


క్రీస్తు బోధ, అపొస్తలుల స్పందన  మరియు ఆది సంఘము యొక్క విధానము
మనకు ఒక సమతుల్య విధానాన్ని తెలియజేస్తుంది.


క్షమించాలి, ప్రార్థించాలి , సహించాలి, ప్రేమించాలి, ప్రశ్నించాలి,....
అన్ని పరిశుద్ధాత్మ అధీనములో, వాక్యపు పరిధిలో,  

సంఘాలు కలిసి ప్రణాళిక బద్ధముగా వ్యవహరించాలి.