'శిష్యులను తయారు చేయుడి' అనేది ప్రభువైన యేసు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ (మత్తయి 28.19). పశ్చాత్తాపముతో పాపము విషయమై మారుమనస్సు పొంది, పూర్ణహృదయముతో యేసు ప్రభువునందు (ఆయనే నిజ దైవం, నా పాప పరిహారము నిమిత్తము సిలువలో బలియైనాడు, తన ద్వారానే నిత్యజీవము అని) విశ్వసించి, ఆయన ఇచ్చు రక్షణను పొందుకొనిన ప్రతి వ్యక్తి, స్థానిక సంఘములో నిరంతర శిష్యరికం అనే ప్రక్రియ కిందకు వచ్చి, వాక్యము చదవడం, వాక్యానుసార పుస్తకాలు చదవడం, సరియైన బోధ వినడం ద్వారా నేర్చుకొన్నవి పాటిస్తూ, క్రీస్తు సారూప్యత లోనికి మారాలి.
అయితే చాలా మంది మతమును ఆచరిస్తున్నట్టుగా, క్యాలెండర్ లోని ఒక వచనమును చదివి, కేవలం ఇహ లోక కోరికలు కోరుకోవడమే ప్రార్థన అన్నట్టుగా ప్రార్థించి, డబ్బులిస్తే (స్పాన్సర్ చేస్తే) దేవుడు బాగుచేస్తాడు, ఉద్యోగమిస్తాడు, పెళ్లిచేస్తాడు, పిల్లలిస్తాడు, పదోన్నతినిస్తాడు అని గుడ్డిగా నమ్మి ఆచరిస్తూ, క్రైస్తవ జీవితములో ఒక్క శ్రమ, అనారోగ్యము ఉండదు అని చెప్పే వాక్య విరుద్ధ బోధను నమ్మి, శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ, ఈ భూమిపై పేరును, ధనమును, కుటుంబమును గొప్ప చేసుకోవడమే లక్ష్యముగా బ్రతుకుతున్నారు.
కొంతమంది పాస్టర్లు దేవుని సంకల్పమంత (అపొ 20.27) బోధించక, బైబిల్ కు స్వంత అర్థమును ఆపాధిస్తూ, మా కుటుంబము మాత్రమే దేవునిలో ఎక్కువ ఎదగాలని ఇతరులకు ఏమి నేర్పించక, క్రీస్తు శిష్యులనుగా చేయాల్సిన సమయములో తమ స్వంత అనుచరులను పొగుచేసుకుంటున్నారు. అందువల్ల చాలా మంది విశ్వాసులు లోకములోకి, అబద్దబోధలోనికి మరలుతున్నారు.
కావున పౌలు గారు చెప్పినట్లుగా,
నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది (గలతి 4.19).
ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము (కొలొస్సి 1.28).
ప్రతి సంఘ సభ్యున్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, బోధించుచు, క్రీస్తును ప్రకటించుటలో ప్రయాసపడుదాము.
గమనిక: కొంత మంది సంఘ కాపరులు శ్రద్ధతో సంఘ సభ్యులను శిష్యులుగా చేయాలనీ ప్రయత్నించినా, ఆదివారం హాజరవడం తప్ప మాకు సమయం లేదు అని చెప్తు తప్పించుకు తిరిగే వారు లేకపోలేదు. వారి ఆశ్రద్దకు తగ్గమూల్యం చెల్లించక తప్పదు.

No comments:
Post a Comment