కుల ఆధారిత హెచ్చుతగ్గులు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు, లోకపు దృక్పథాన్ని గ్రుడ్డిగా అనుసరించక వాక్య ఆధారిత ఆలోచన కలిగి, లోకమునకు ఉప్పులా మరియు వెలుగులా బ్రతకాలని బైబిల్ హెచ్చరిస్తుంది.
ఎఫెసియులకు వ్రాసిన పత్రికలో రెండవ ప్రార్థన (3.15-19) యొక్క సందర్భమును గమనిస్తే, ఆ ప్రార్థన లోని మనవులు, హెచ్చుతగ్గుల నిర్ములనకై మనలో ఎలాంటి మార్పులు రావాలో తెలియజేస్తుంది.
రెండవ అధ్యయము నుండి, మన పూర్వ స్థితి ఎంత పాప సహితమయిందో, అక్కడనుండి లేపి దేవుడు మనల్ని ఉచితముగా రక్షించి, క్రీస్తుయేసునందు మనలను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి, ఈ భూమిపై విశ్వాససమాజము అంతా ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయుండి దేవునికి నివాసస్థలముగా కట్టబడుతున్నామని మరియు సమానవారసులము, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునైయున్నామని తెలిపి, అలా తమ సమానత్వాన్ని విశ్వాసులంతా పాటించాలని పౌలు గారు ప్రార్తన చేయడం జరిగింది.
తన ప్రార్థనలోవున్న మనవులు:
1. మనము అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను ,
2. క్రీస్తు మన హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,
3. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా,
4. ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
మనము ఎక్కువగా శారీరక ఆరోగ్యము మరియు క్షేమము కొరకు మాత్రమే ప్రార్ధిస్తాము కానీ ఆత్మీయ జీవితము బలముగా ఉండాలని తపన కావాలి. ఏ కులము వారైనా ఆదాము అవ్వ నుండే వచ్చినామని నమ్మితే హెచ్చుతగ్గులేక్కడివి? అందరమూ సృష్టి ద్వారా సమానమే కదా? ఆత్మీయంగా బలహీనులే కుల వ్యత్యాసాలను వివాహములో చూపిస్తారు. అందుకే పౌల్ గారు, హెచ్చుతగ్గులు వద్దు అని వివరించి అలా ప్రార్థించాడు. అప్పుడు మనము క్రీస్తును నిజముగా మన హృదములో కలిగిన వారముగా కనబడుతాము మరియు దేవుని సంపూర్ణతయందు పూర్ణులమవుతాము. మనము క్రీస్తు ప్రేమను పరిశీలించి తెలుసుకోని, ఆయనలా ప్రేమించడంలో ఎదగాలని ఈ వాక్యమునుండి అన్వయించుకుందాము.
ప్రార్థన:
ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి!
మాలోని ఈ లోకానుసార వ్యత్యాసాలు తొలగించి, క్రైస్తవ సమాజమంతటికి సమానత్వ దృక్పథాన్ని ఇమ్మని, మేము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల నిన్ను, యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి.

No comments:
Post a Comment