చార్లెస్ ఇ. హమెల్ వ్రాసిన అర్జెంట్ పనుల నిరంకుశత్వం అనే ఆర్టికల్ ను నావిగేటర్స్ వారు ప్రచురించిన 2.7 సిరీస్ అనబడే శిష్యత్వపు కోర్స్ లో చదవి, చాలా సార్లు ఈ ఆర్టికల్ పై చర్చించి, నా సమయ పాలనలో అనేక మార్పులు చేసుకున్నాను. ఆ ఆర్టికల్ ని సంక్షిప్తంగా వ్రాసి మీ ముందుంచుతున్నాను.
మన జీవితములో చేయలేక వదిలేసిన పనులు ఎన్నో ఉన్నాయి.
"1. దేవునితో చాలినంత సమయం గడపకపోవడం,
2. భార్యా పిల్లలకు ఇవ్వాల్సినంత పట్టింపు ఇవ్వకపోవడం,
3. సంఘ క్షేమాభివృద్ధికి దేవుడు మనకిచ్చిన తలంతును దాని పరిమాణం మేరకు వినియోగించకపోవడం,
4. మనమెక్కువ సమయం గడిపిన వారికి సైతం రక్షణ సువార్తను పూర్తిగా వివరించకపోవడం,
5. మన కుటుంబ పోషణ కొరకు చేసే పనిలో శక్తిమేర చేయకపోవడం..మొదలగునవి."
మనము చేయవలసినవి ఎందుకు చేయలేదంటే, వాటిని చేయవలసిన సమయంలో ఏవో ప్రాముఖ్యము కాని, అప్పుడే చేయవలసిన (అర్జెంట్) పనులు అనే డిమాండ్లు మన స్థావరం లోనికి చొచ్చుకు వచ్చి, మనము రక్షించబడిన తరువాత జీవితములో వేటిని చేయాలని దేవుడు ముందుగా సిద్ధపరిచాడో (ఎఫెసీ 2.10) ఆ సత్క్రియలు చేయకుండా మనల్ని మన బాధ్యతలలో ఒడిపోయినవారుగా చేస్తున్నాయి.
యేసు ప్రభువు భూమిమీద మరణ దినమునకు ముందు రోజు రాత్రి,
"చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని (యోహాను 17.4)"అని ఎలా చెప్పాడు? పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు తానేనని ప్రజలకు ఋజువుచేసే అద్భుత కార్యాలు జరిగించాలి, రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేయాలి, దానిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసే వ్యక్తులను తయారు చేయాలి. ఇదంతా కేవలం మూడున్నర సంవత్సరాలలో!
తన ముందు నిర్ధేశించబడిన లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో తండ్రి సూచనలకై కనిపెట్టే లక్షణాన్ని కలిగి,
"ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను (మార్కు 1.35)."
ఆ కారణంగానే మనుష్యులు అర్జంటుగా అడుగుతున్నవాటిని అడ్డగిస్తూ, తన కార్యచరణకై ఏది అవసరమో దాన్నే చేయగలిగాడు. అనుసరిస్తున్న జనసమూహము యొక్క పాపులారిటీని కోరక, శిష్యులను తయారు చేయుటపై దృష్టి సారించాడు.
అర్జెంట్ పనుల నిరంకుశత్వానికి బానిసలై, అందరిని తృప్తి పరచాలి, అన్నిట్లో పాల్గొనాలి, అన్ని నా ద్వారా జరగాలి, అనే ఆలోచనలతో, అన్నీ చేపట్టి, వాటిని నెరవేర్చడం కోసం ఉన్మాదిలా పరుగెడుతూ, నిరాశకు, తీవ్ర ఒత్తిడికి లోనవడం, అల్సర్లు, గుండెపోటు..లాంటివి పొందుకోవడం, అన్నిటికంటే మిన్నగా మన అసలు బాధ్యతలను నాణ్యముగా చేయకపోవడం జరుగుతుంది.
అనుదినం దేవుని సూచనాలకై కనిపెట్టడానికి, మన బాధ్యతలను నెరవేర్చే ప్రణాలికను అంచనా వేసుకోవడానికి, దానిని చేయడానికి అవసరమైన దేవుని శక్తిని కోరడానికి, సరిపడినంత సమయాన్ని కేటాయించుదాం...ఆయన అప్పగించిన పనిని సంపూర్ణముగా పూర్తిచేద్దాము... భళా! నమ్మకమైన మంచి దాసుడా" (మత్తయి 25.21) అని ప్రభువు నోట వినటానికి ఆశిద్దాం.




