Thursday, September 20, 2018

ఒక ప్రముఖ పాట వెనుక నిజ సంఘటన



చాలా పాటలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే ఇంగ్లీష్ పాట క్రైస్తవ సంఘాలలో చాలా ప్రాచుర్యములో ఉన్నది. అదే పాట 'నే వెంబడింతును నా యేసుని నిత్యము' అని తెలుగులో తర్జుమా చేయబడింది.


మన దేశంలో అస్సాం అనే ప్రాంతంలో ఒక వెల్స్ మిషనరీ 19 వ శతాబ్దం మధ్యకాలంలో గ్యారో అనే (మానవుల తలలు వేటాడే) తెగ వారి మధ్య సువార్త ప్రకటించాడు. వారిలో ఒకడైన నోక్సెంగ్ అనే వ్యక్తి తన భార్య మరియు యిద్దరు పిల్లలతో సహా, యేసు ప్రభువునందు విశ్వాసముంచాడు.


ఆ గ్రామ పెద్ద, నోక్సెంగ్ యొక్క కుటుంబమును, ఆ గ్రామ ప్రజలందరి యెదుట నిలిపి, యేసుని విడిచిపెట్టకపోతే, అతని ఇద్దరు పిల్లలను చంపుతానని బెదిరించాడు. అప్పుడు నోక్సెంగ్ 'ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్' (యేసుని వెంబడించుటకు నిర్ణయించుకున్నాను, నేను వెనుదిరుగను) అని అన్నాడు.


ఆ పిల్లలను చంపి, మళ్ళి, యేసుని విడిచిపెట్టకపోతే అతని భార్యను చంపుతానని బెదిరించాడు గ్రామ పెద్ద. అప్పుడు నోక్సెంగ్ 'ధో నన్ గో విత్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో' (నాతో ఎవరు రాకున్నా, నేను మాత్రము వెంబడిస్తాను) అని అన్నాడు.


ఆతని భార్యని చంపి, మళ్ళి, యేసుని విడిచిపెట్టకపోతే అతన్ని కూడా చంపుతానని బెదిరించాడు గ్రామ పెద్ద. అప్పుడు నోక్సెంగ్ 'ధ క్రాస్ బిఫోర్ మీ, ధ వరల్డ్ బిహైండ్ మీ' (సిలువ నా ముందుంది, లోకం నా వెనుకుంది) అని అన్నాడు. వెంటనే అతనిని కూడా వారు చంపివేశారు.


నోక్సెంగ్ యొక్క దృఢమైన విశ్వాసమును చూసి, ఆ గ్రామ పెద్ద మరియు గ్రామస్థులందరు యేసు ప్రభువునందు విశ్వాసముంచారు.


ఆయన పలికిన చివరి మాటలను మనము పాటగా పాడుకుంటున్నాము. బిల్లీ గ్రహం గారు ఎక్కువగా సువార్త సభలలో ఈ పాటను ఉపయోగించేవారు.


హతసాక్షుల రక్తము సంఘమునకు విత్తనముగా ఉన్నది.

అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును (మత్తయి 16.24-25)

ఒకవేళ ప్రభువును తృణీకరిస్తె, అప్పుడు వారి చేతిలో చావకపోయిన ఏదో ఒకరోజు చనిపోయి నరకంలో ఉండేవాడు. నిజముగా రక్షింపబడినవాడు అంతము వరకు ప్రభువును వెంబడిస్తాడు, అంతేగాని ఎవరో చంపుతానంటే బెదిరిపోయి క్రీస్తును వదిలిపెట్టడు.  


ఇతరులు వచ్చి హింసిస్తున్నపుడు మనలో వారు స్వచ్ఛమైన విశ్వాసమును చూడాలి, కాని పోకిరి మాటలు, మీసాలు మెలేస్తూ.. తొడలు కొడుతూ.. సవాళ్లు చేయడం.. కాదు.


"నా మరణం కొంతమంది కళ్ళు తెరిపిస్తుందంటే, నేను హతసాక్షి అవడానికైనా సిద్ధం" అనే నిర్ణయం కలిగిన విశ్వాసులు నేడు కావలి.


మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను (రోమా 8.18).


7 comments: